నిజమైన భక్తుడు




హరినామస్మరణలో నారదునికి మించినవారు లేరు. నారాయణ నామం జపిస్తూనే ముల్లోకాలు సంచరిస్తూ ఉంటాడు  ఒకరోజు వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని స్తుతించి ఇలా అంటాడు స్వామి నిరంతరం నీ నామ స్మరణచేస్తూ తిరిగే నేనే నీ భక్తులలో మొదటి వాడిని కదా అని ప్రశ్నిస్తాడు ఓహో నారదునికి అహం (నేనే) కారం పెరిగింది అది తొలగించాలి అని శ్రీహరి తలచి ఇలా జవాబు చెపుతాడు - నారదా.... నీవు గొప్ప భక్తుడువి కాదనను కానీ నీకన్నా గొప్ప భక్తుడు భూలోకంలో ఉన్నాడు పరికించు అని భూలోకం వైపు చూడమంటాడు.

భూలోకంలో ఓ పేదరైతు తన వ్యవసాయం తాను చేసుకుంటూ, తన కుటుంబాన్ని, తను పోషించుకుంటూ, ప్రతి పనికి ముందు శ్రీహరి నామాన్ని జపిస్తూ అంతా స్వామిదయ, నాదేమీ లేదు అని తలపోస్తూ జీవితాన్ని గడుపుతూ కనబడతాడు ఆ భక్తుని చూసి నారదుడు శ్రీమన్నారాయణా ఆ రైతు తన పనులు తాను చేసుకుంటూ, అప్పుడప్పుడు మాత్రమే నీ నామాన్ని జపిస్తున్నాడు నాకంటే నీకు ఆ భక్తుడు ఎలా ఆప్తుడౌతాడు అని ప్రశ్నించిన నారదునితో శ్రీహరి.

సరే నారదా.. నీకు ఓ పరీక్ష పెడతాను అందులో నీవు నెగ్గితే నీవే గొప్ప భక్తుడవని అంగీకరిస్తాను అని పలికి నూనెతో నిండిన ఒక పాత్రను తెప్పించి అది నారదుని తలపై పెట్టి ఒక్క చుక్క నూనె కూడా క్రింద పడకుండా ఈ రోజంతా నీవు భూలోకం చుట్టిరా అలా వస్తే నీవే గొప్ప భక్తుడివి అని చెబుతాడు..

పందెంలో గెలవాలని, నూనె చుక్క క్రిందపడకూడదనే తలంపుతో సంచరిస్తూ, నారాయణ నామాన్ని స్మరించడం మరచిపోతాడు అలా తిరిగి సాయంత్రానికి విష్ణులోకం చేరుకుని, ప్రభూ నీవు చెప్పినట్లే నూనె చుక్క క్రింద పడకుండా వచ్చాను పందెం గెలిచినట్లే కదా అన్న నారదునితో నూనె క్రిందపడలేదు కాని నా నామాన్ని ఎన్ని మార్లు జపించేవు  అని అడిగిన శ్రీహరితో అయ్యో పాత్రమీద ధ్యాసతో నీ నామం పలకడమే మరచిపోయాను అంటాడు.

అపుడు శ్రీహరి ‘చూసావా నారదా నీకు వేరేపని లేదు కనుక నిరంతరాయంగా నా నామాన్ని స్మరిస్తున్నావు ఇంకో పని చేయాలంటే నా నామం పలకడం మరిచావు కాని ఆ రైతు తన కర్తవ్యాన్ని తాను చేసుకుంటూ మనసులో నన్నే స్మరిస్తూ జీవిస్తున్నాడు ఎవరైతే మనసా, వాచా, కర్మణా నన్నే ధ్యానిస్తూ ఉంటారో వారికి నళినీపత్ర జలబిందు (తామరాకు మీద నీటి బిందువు) న్యాయంలా పాపములు అంటక పరమాత్ముని సన్నిధి చేరుకుంటాడు అని పలికి నీవు కూడా నాకు ఆప్తుడవే అందులో సందేహం లేదు అని పలికిన శ్రీహరితో స్వామి నన్ను క్షమించండి నిజమైన భక్తికి తారతమ్యాలు లేవని తెల్పి, నా గర్వాన్ని పోగొట్టిన మీకు శతకోటి వందనాలు అని పలికి నిష్క్రమిస్తాడు

Comments