తులసి తిందామా..

Health Tips
తొలకరి జల్లులు పడగానే జలుబూ, ఇన్‌ఫెక్షన్లూ, ఇతరత్రా ఆరోగ్య సమస్యలూ చుట్టుముడతాయి. తులసితో ఇంట్లోనే కొన్ని రకాల పరిష్కారాలు లభిస్తాయి.

• మరి ఎలాంటి సమస్యకు ఏం చేయాలో చూద్దామా

ప్రతిరోజూ ఉదయాన్నే గ్లాసు నీళ్లలో పది పదిహేను తులసి ఆకులు వేసి మరిగించాలి. నీళ్లు గోరువెచ్చగా అయ్యాక తాగాలి. ఇలా చేయడం వల్ల జ్వరం, దానివల్ల వచ్చే నీరసం, జలుబూ, దగ్గూ వంటివి అదుపులోకి వస్తాయి. ఆస్తమా, బ్రాంకైటీస్... ఇంకా దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారు అరకప్పు నీళ్లలో గుప్పెడు తులసి ఆకులూ, చెంచా అల్లం తరుగూ వేసి కాయాలి. బాగా మరిగాక దించి, అందులో చెంచా తేనె కలిపి తీసుకోవడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది.


• గొంతు నొప్పిగా ఉన్నప్పుడు బాగా మరిగించిన వేణ్నీళ్లలో గుప్పెడు తులసి ఆకులు వేసి మూత పెట్టాలి. గోరువెచ్చగా అయ్యాక ఆ నీళ్లను పుక్కిలించాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు చేయడం వల్ల త్వరగా ఫలితం కనిపిస్తుంది. ఉదయాన్నే తులసి ఆకులు నమలడం వల్ల గుండెకెంతో మంచిది. కొలెస్ట్రాల్ స్థాయుల్ని తగ్గించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. ఒత్తిడీ దూరమవుతుంది. నోటి పూతలూ తగ్గుతాయి.

• మూత్రపిండాల సమస్యలున్న వారికి తులసి ఎంతో మేలు చేస్తుంది. తులసి రసం తీసుకుంటే కిడ్నీలో రాళ్లు క్రమంగా కరిగిపోతాయి. అదే పురుగులూ, ఇతరత్రా ఏమైనా కుట్టినప్పుడు ఆ ప్రాంతంలో ఈ రసం రాసినా ఫలితం ఉంటుంది.

• తులసిని తీసుకోవడం వల్ల దంతాలూ, చిగుళ్ల సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ బయోటిక్ గుణాలు సమస్యల్ని దూరం చేస్తాయి. తులసి ఆకుల్ని పొడి చేసి ఆవనూనె కలిపి పళ్లు తోముకోవడం వల్ల చిగుళ్ల నుంచి రక్తం కారకుండా ఉంటుంది. ఇన్‌ఫెక్షన్లూ తొలగిపోతాయి. తులసి ఆకుల్లో విటమిన్ 'ఇ' కంటిచూపునకు దోహదం చేస్తుంది. వందగ్రాముల ఆకులు తీసుకుంటే రోజుకు అవసరమయ్యే విటమిన్ 'ఎ' అందుతుంది. రోగనిరోధక శక్తీ పెరుగుతుంది.

Comments