పులి-కంకణము-బాటసారి...నీతి చంద్రిక - పరవస్తు చిన్నయ సూరి మిత్రలాభము...

Chandamama kathalu in Telugu
ఒక ముసలి పులి స్నానముచేసి దర్భలు చేతఁబట్టుకొని కొలని గట్టుననుండి యోయి తెరువరీ, యీ పయిఁడి కంకణము వచ్చి పుచ్చుకొ'మ్మని పిలిచి చెప్పెను. ఒక పాంథుఁడా మాట విని యిది నా భాగ్యముచేతనే వచ్చుచున్నది. ఏల సందేహపడవలె'నని చింతించి, యేదీ కంకణము చూపు'మని యడిగెను.
పులి చేయిచాఁచి యిదిగో హేమ కంకణము చూడు మని చూపెను. నీవు క్రూర జంతువవు కాఁబట్టి యేలాగున నిన్ను నమ్మవచ్చునని పాంథుఁడు పలికెను. ఆమాట విని పులి యిట్లనియె. ఓరీ పాంథా! విను, మునుపు యౌవనమందు మిక్కిలి దుష్టుఁడనయి యుంటిని.

అనేకములగు గోవులను మనుష్యులను వధించి మితిలేని పాపము సంపాదించి భార్యాపుత్రులను బోఁగొట్టుకొని యేకాకినయి నిలిచితిని. అనంతర మొక పుణ్యాత్ముండు నా యందు దయచేసి, యికమీదట గోవులను, మనుష్యులను వధింపకు, సత్కార్యములు చేయుమని చెప్పెను. అది మొదలుకొని పాపకృత్యములు విడిచి మంచి కార్యములు చేయుచున్నవాఁడను, వృద్ధుఁడను, బోసి నోరి వాఁడను. గోళ్ళు పోయినవి,
లేవ సత్తువలేదు. 

నన్ను నీవేల నమ్మవు? నీవు దరిద్రుఁడవు కాఁబట్టి యిది నీకు దానము
సేయవలెనని కోరితిని. సంశయపడక యీ కొలనిలో స్నానము చేసి వచ్చి పసిఁడి కంకణము పుచ్చుకొమ్ము అనఁగానే వాఁడు పేరాసచేత దాని మాటలకు లోఁబడి కొలనిలో స్నానము చేయ బోయి మొలబంటి బురదలో దిగఁబడెను. అప్పుడు పులి చూసి యయ్యయ్యో, పెను రొంపిలో దిగఁబడితివి గదా! నేను వచ్చి నిన్ను లేవ నెత్తెదను. భయపడకు మని తిన్నతిన్నఁగా సమీపించి వానిని బట్టుకొనెను. ఈలాగున వాఁడు తగులుకొని క్రూరజంతువును నమ్మరాదు. నమ్మి యీ గతి తెచ్చుకొంటిని. మించినదానికి వగచి యేమి ప్రయోజనము? ఎవ్వరికైన విధి తప్పించుకో వశముగాదు. అని చింతించుచు దానిచేత భక్షింపఁబడియె.

కాఁబట్టి సర్వవిధముల విచారింపని పని చేయరాదు.
చక్కఁగా విచారించి చేసిన పనికి హాని యెప్పటికి రాదు.

COURTESY:www.facebook.com/pages/చందమామ-కథలు

Comments